నిన్న రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ . ధోని క్రీజులోకి వచ్చేప్పటికి 18 బాల్స్ లో 44 పరుగులు కొట్టాలి. కాస్త టఫ్ టార్గెట్టే. కానీ క్రీజులో ఉంది జడేజా అండ్ ధోని. ఈ కాంబోలో టీమిండియా క్రికెట్ నుంచి సీఎస్కే ఫ్రాంచైజ్ వరకూ ఎన్నో విజయాలు చవి చూశాయి గతంలో. చివరి ఓవర్లలో బౌలర్లను చావబాదుతూ సాధించిన ఘన విజయాలు వీళ్ల కెరీర్ లో ఉన్నాయి. ప్రధానంగా ధోని నిన్న 11 బాల్స్ లో 1 ఫోర్, ఓ సిక్సర్ తో 16 పరుగులు చేశాడు. జడేజా 22 బాల్స్ లో ఓ సిక్సర్ రెండు ఫోర్లతో 32 పరుగులు చేశాడు.ఆఖరి ఓవర్ లో 20 పరుగులు కావాలంటే గేర్లు మార్చాల్సిన ధోని అవుటైపోయాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో జడ్డూ మ్యాచ్ ముగుస్తుంటే చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. ఆఖరికి మ్యాచ్ గెలవలేదు. రాజస్థాన్ కు 6 పరుగుల తేడాతో విజయాన్ని అప్పగించారు. స్టాట్స్ పరంగా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా...ఈ ఓటమి జడేజా, ధోని వల్లే అనేది ఫ్యాన్స్ ఫీలింగ్. బయటివాళ్లు సీఎస్కే ఫ్యాన్సే బాధపడుతున్నారు. టీ20 జమానాలో ఓ బంతికి రెండు పరుగులు తీస్తేనే ఈ ఫార్మాట్ లో నిలబడగలం. 120 బంతుల్లో 300 పరుగుల టీమ్ స్కోర్ కొట్టాలని సన్ రైజర్స్ లాంటి టీమ్స్ ఉవ్విళ్లూరుతున్న టైమ్ లో...ధోని 11 బాల్స్ లో 16, జడ్డూ 22 బాల్స్ లో 32 పరుగులు అంటే వన్డే తరహా బ్యాటింగ్. అది టీ20 లకు పనికి రాదని వాళ్లు చోక్ అవ్వటం వల్లే చేతిలో మ్యాచ్ పోయిందని బాధపడుతున్న ఎల్లో ఆర్మీ. ప్రధానంగా ధోని ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొన్న తొమ్మిదోస్థానంలో, నిన్న ఏడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు మాహీ. 2019 తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ లేదు ఐపీఎల్లో. వాస్తవానికి బ్యాటర్ గా అతని ప్రైమ్ 2019 సీజన్ తోనే ముగిసిపోయింది. పోనీ టీమ్ ను ఫ్యూచర్ కోసం సెట్ చేయటానికి ఉంటుున్నాడు అనుకుంటాకన్నా 2023 ఐపీఎల్ ట్రోఫీని సీఎస్కే కైవసం చేసుకోవటం ది బెస్ట్ మూమెంట్ ధోని రిటైర్మెంట్ ప్రకటించటానికి. ఆ ఫైనల్లో గుజరాత్ పై జడేజా అద్భుతమైన విజయాన్ని అందించిన తర్వాత ధోని జడ్డూనూ రెండు చేతులతో ఎత్తుకుని గాల్లోకి లేపుతాడు. ఏ సీఎస్కే అభిమానికైనా వాళ్ల లైఫ్ టైమ్ మెమరబుల్ మూమెంట్ అది. అంత సంతోషంలో ఉన్నప్పుడే వదిలేసి ఉంటే గౌరవంగా ఉండేదని..అభిమానుల కోసం ఆడదామని ఆడుతున్నా 43 ఏళ్ల వయస్సులో ధోని మునుపటిలా మ్యాచెస్ ఫినిష్ చేయలేకపోతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ ఎవ్వరి మీద చూపించాలో తెలియక పాపం తెగ ఇబ్బంది పడిపోతున్నారు తలా ఫ్యాన్స్.